రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -
మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం
ఖమ్మం, జూలై 26: రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. మండలంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన సవాలు చేశారు.
గతంలో రుణమాఫీపై ప్రశ్నించినప్పుడల్లా సమాధానం దాటవేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారే తప్ప, హామీల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదని పువ్వాడ మండిపడ్డారు. పాలకుడి మనసు మంచిగా ఉంటేనే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని, అందుకు కేసీఆర్ పాలనే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ హయాంలో రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువుల సరఫరా వంటి పథకాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే రైతుబంధు నిధులను అరకొరగా జమ చేస్తోందని, గతంలో సులభంగా అందిన యూరియాను ఇప్పుడు యాప్‌ల పేరుతో దూరం చేసి, ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. విద్యుత్ కోతలు మళ్లీ పెరిగాయని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, మోటార్లు దెబ్బతినడం వంటి సమస్యలతో రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన పంట బోనస్ హామీ కూడా నీరుగారిపోయిందని విమర్శించారు.
"మోసపోతే గోస పడతాం" అని కేసీఆర్ గతంలో అన్న మాటలు నిజమవుతున్నాయని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇప్పుడు అదే అనుభవిస్తున్నారని పువ్వాడ అన్నారు. గత రెండు నెలలుగా వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.